My Pages

11, సెప్టెంబర్ 2024, బుధవారం

ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినోత్సవం. | తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు.




ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినోత్సవం. 

తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు.

2022లో మనదేశంలో లక్షా డెబ్బైవేల మంది ఆత్మహత్యకి పాల్పడ్డారని జాతీయ నేర చిట్టాల సంస్థ చెప్తోంది. ఇంకా నమోదుకాని ఆత్మహత్యలు ఇంకెన్నో. 2018తో పోలిస్తే ఈ సంఖ్య 27% ఎక్కువ. అంటే మనదేశంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. పైగా ఇలా చనిపోయినవాళ్లలో ఎక్కువమంది యువతే. ఆత్మహత్యకి సంబంధించి అందరూ తెలుసుకోవాల్సినవి కొన్ని ఇక్కడ రాశాను.


1. ఆత్మహత్య చేసుకునేవారు, పాల్పడేవారు పిరికివారు బలహీనులు కాదు. ఆత్మహత్యకి కారణాలుంటాయి- మెదడులో మార్పులు, మానసిక ఒత్తిడులు, ఆసరా లేకపోవటం మొదలైనవి. గుండెపోటుతో చనిపోయినవాళ్ళని మనం పిరికివాళ్ళు అని అనం.

2. ఏ ఒక్క కారణం వలన మాత్రమే ఆత్మహత్యకి పాల్పడరు. వార్తల్లో రాసినట్లు తీవ్రమైన కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య లాంటివి నిజాలు కావు. చాలా విషయాలు ఎప్పట్నుంచో పేరుకుని ఒక విషయంలో అన్నీ కలిసి ఆత్మహత్యకి పురిగొల్పుతాయి.

3. ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన స్థిరం కాదు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవాళ్లు చనిపోవాలి అనే బలమైన నిర్ణయంతో కాకుండా ఏం చేయాలో తెలీని అయోమయంలో ఎక్కువ ఉంటారు. వీరికి ఆ క్షణంలో తార్కికంగా ఆలోచించే శక్తి, ఓపిక ఉండవు. వారికి అప్పుడు ఆసరాగా నిలవటం ద్వారా ఆ ఆలోచనలనుంచి బయటపడవేయవచ్చు.

4. ఒక బలమైన ఆత్మహత్యా ప్రయత్నం చేసి బతికినవాళ్లు తర్వాత సాధారణ జీవితం గడుపుతారు. అంటే ఒకసారి ఆత్మహత్యకి ప్రయత్నించినవాళ్లు కచ్చితంగా మళ్లీ ప్రయత్నించి చనిపోతారు అన్నది నిజం కాదు. వారిలో 85-95 శాతం మంది సాధారణ జీవితం గడుపుతారు.

5. “నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాను, నాకు చనిపోవాలని ఉంది.” వంటి ఆలోచనలు చెప్పేవాళ్ళ మాటలని తప్పనిసరిగా పట్టించుకోవాలి. ఆ మాటల నిగూడార్థం “నాకు నహాయం కావాలి.” అని. వాళ్లకి సాంత్వన చేకూర్చాలి కానీ గేలి చేయరాదు. లేదా వీళ్లు నటిస్తున్నారు అని అవమానపరచకూడదు.

6. మనతో ఆత్మహత్య ఆలోచనలు పంచుకునేవాళ్లు వచ్చే రెండు మూడు వారాల్లోపు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. మీరెంతో దగ్గరైతే గానీ మీతో ఆ ఆలోచనలు పంచుకోరు. ఒకవేళ మీతో పంచుకుంటే మీరు అన్ని పనులూ పక్కనపెట్టి వాళ్లకి దన్నుగా నిలబడాల్సిన సమయం అది. అలాగే సత్వర వైద్యానికి తీసుకువెళ్లాల్సిన సమయం అది.

7. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం మనకొక హఠాత్పరిణామం అనిపిస్తుంది కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆత్మహత్యా సంకేతాలు ఎప్పటుంచో ఉంటాయి. అది మనం గమనించి ఉండము అంతే. కాబట్టి ఆత్మహత్య ఆలోచనలు, సంకేతాల గురించి అనుమానం వచ్చినా కూడా సదరు వ్యక్తిని మనం అడగటంలో తప్పులేదు. అడిగి సహాయాన్ని ఇవ్వవచ్చు.

8. ఆత్మహత్యకి సంబంధించి చనిపోవటానికి దారితీసే పరిస్థితులకి దూరంగా పెట్టడం ద్వారా ఆత్మహత్య సంఖ్యల్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఉదా, క్రిమిసంహారక మందుల్ని నిలువరించటం, చీటీ లేకుండా మందులు ఇవ్వకపోవటం, పెట్రోలు విడిగా సీసాల్లో నింపకపోవటం, రైలు పట్టాల దగ్గర భద్రత, వంతెనలపై ఎత్తుగా కంచెలు పెట్టడం.

9. మీరేమి చేయలేరని అనుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవాళ్ళని మనమెలా ఆపగలం అనుకోవద్దు. సాధారణంగా ఆ ఆలోచన ఉన్నవాళ్ళకి కాపలాగా కొంతసేపు ఉన్నా కూడా అదే చావుకి బ్రతుకుకి మధ్య గోడగా నిలబడుతుంది. మీకేమీ కౌన్సిలింగ్ నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదు. ఒక మనిషిగా తోడు ఉండాలన్న ఆలోచన ఆత్మహత్యని ఆపుతుంది.

10. ఆత్మహత్య గురించి అడగటం, వారి మనసులోని బాధని తెలుసుకోవటం ఆత్మహత్యకి పురిగొల్పదు, పైగా వారి మనసులోని బాధని తగ్గించటానికి ఉపకరిస్తుంది. మీరు చేయవలసిందల్లా కొంత సమయం వెచ్చించి వాళ్లు చెప్పేది వినటం. మీరు గాభరా పడొద్దు. మీరు పక్కన ఉన్నంత సేపూ వాళ్లు ఆత్మహత్య ప్రయత్నం చెయ్యరని గుర్తించండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...